ఉత్తరాల వూసులు – ఉత్తరాల వూసలు
పాత ఉత్తరాల వూసులనగానే గుర్తొచ్చింది మా ఇంటి ఉత్తరాల వూస కడుపులో కుటుంబ బంధాలన్నీ దాచుకుని అడిగిన ప్రతి వారికి చెప్పాలనుకునే మూలనున్న ముసలమ్మలా ఆ రోజుల్లో ఏ ఇంట్లో నైనా ఏదో ఒక మూల ప్రత్యక్షం ఈ వూస. అదేకదా అప్పట్లో మరి ప్రతీ ఇంటికి గూగుల్ ఇన్బాక్స్. ఎవరింట్లో చూసినా ఈ వూస నిండుగర్భిణి లాగే వుండేది ఏళ్ల తరబడి ఉత్తరాలన్నీ మోస్తూ పుష్పక విమానంలా దానిలో చోటు కి పరిమితి అన్నదే లేదు దాన్ని ఖాళీ చేయడానికి ఎవరికీ అవసరమూ లేదు, తీరుబడీ లేదు అదెప్పుడూ నిండుగా శుభ వార్తలు, మామూలు కబుర్లే దాచుకునేది (అశుభ వార్తల వుత్తరాలు వచ్చిన వెంటనే చింపేసేవారుగా) ఆ వూస ని చూస్తుంటే ముచ్చట వేసేది. అక్కడక్కడ పసుపు చుక్కలతో శుభకరమైన విశేషాల కార్డులు, కవర్లు
“మహారాజశ్రీ బావగారికి నమస్కరించి వ్రాయునది. మీ కోడలు కార్తీక శుద్ధ త్రయోదశి నాడు ఉ. 8.32 ని. పండంటి మగబిడ్డను ప్రసవించినది. తల్లీ బిడ్డ క్షేమం.” – చదవగానే ఇంటిల్లిపాదికీ చెప్పలేని సంతోషం. “ బ్రహ్మశ్రీ రామారావు గారికి ప్రకాశ రావు నమస్కరించి వ్రాయునది. మీ అమ్మాయి మాకు నచ్చినది. మంచి రోజు చూసి మీరు వస్తే మిగతా విషయాలు మాట్లాడుకొందాము. వచ్చే మాఘ మాసము లో పెళ్ళికి అనుకూలము.” – చదవగానే అక్కకి వళ్ళంతా సిగ్గు. అమ్మా నాన్నలకి హడావుడి. “With reference to the interview conducted on ---, you have been selected for the post of Assistant Manager with a scale of pay of ------. Final appointment order will be issued after verification of original certificates at our office.” - దీనికి తమ్ముడు గంతులే గంతులు.
ఈ శుభ వార్తల వుత్తరాలు ఎవరికి కావలసినవి వాళ్ళు తమ కళ్ల తోటే ఫోటో తేసేసుకుని మదిలో నిక్షిప్తం చేసుకునే వారు. ఒరిజినల్ మాత్రం వూస తీసేసుకునేది. ఎప్పుడైనా ఖాళీ వుండి సరదాగా వూసను పలకరిస్తే ఉత్తరాల ఊసులన్నీ చెప్పేది – సంస్కార వంతమైన భాషా ప్రయోగాలు నేర్పేది – మహారాజ్యశ్రీ పెదనాన్న గారికి , పూజ్యులైన మామయ్య గారికి ,మహా లక్ష్మీ సమానురాలైన అక్కయ్య గారికి, గంగా భాగీరధీ సమానురాలైన పెద్దమ్మ గారికి , చిరంజీవి కుమార్ ను ఆశీర్వదించి వ్రాయునది, ప్రియమైన తమ్ముడికి.. వగైరా. ఇంకా ఎన్ని ఉభయ కుశలోపరులు..., ఇక్కడంతా క్షేమం, అక్కడంతా కులాసా అని తలుస్తాను.. లు , ఎన్ని చిత్తగించవలెను లు, ఇంకెన్ని నమస్కారములతో భవదీయుడు లు .. (నాకు అన్నిటికంటే నచ్చింది – మహారాజశ్రీ తాత గారికి తమ మనవడు నిత్యమూ అనేక నమస్కారములు చేయుచూ వ్రాయునది ..)
ఏవీ ఇప్పుడా ఉభయ కుశలోపరులు? ఏరీ ఆ భవదీయులు? ఎక్కడికి పోయాయి ఆ పసుపు బొట్లు పెట్టిన శుభకార్యాల కార్డు పిలుపులు? ఏవీ ఆ సీతా రాముల బొమ్మల తో బుక్ పోస్ట్ లో వచ్చిన శుభలేఖలు ? ఆ మహారాజశ్రీలు, పూజ్యులు, మ. ల. స. ల తో పాటే అవన్నీ అదృశ్యమైపోయాయి. వారు పోతూ పోతూ ఆ వూసను కూడా తీసుకు పోయారు. ఇప్పుడు అవన్నీ ఎవరూ వ్రాయని చరిత్రలు. ఇప్పుడెవరూ చెప్పుకోని వూసులు. చిన్నతనంలో చూసిన వారికి అవి తీపి జ్ఞాపకాలు. ఇప్పటి కుర్ర కారుకి చెప్పినా అర్ధం కాని సెంటిమెంట్లు. ఆ వూసుల వూస నా జ్ఞాపకాల మాలలో మరుపురాని మణిపూస.
WhatsApp
Telegram